టెన్షన్‌.. టెన్షన్‌ | Sakshi
Sakshi News home page

టెన్షన్‌.. టెన్షన్‌

Published Wed, Dec 19 2018 3:01 AM

Employee retirement   Introduction to age hikes - Sakshi

సాక్షి, హైదరాబాద్‌: ఈ డిసెంబర్‌ 31తో పదవీ విరమణ చేయనున్న వందల మంది ఉద్యోగులకు ఇప్పుడు టెన్షన్‌ పట్టుకుంది. ముఖ్యమంత్రి కె.చంద్రశేఖర్‌రావు ఇచ్చిన హామీ అమలవుతుందా?.. లేదా?.. అన్న ఆందోళన వారిని పట్టి పీడిస్తోంది. టీఆర్‌ఎస్‌ అధికారంలోకి వస్తే ఉద్యోగుల పదవీ విరమణ వయస్సును 61 ఏళ్లకు పెంచుతామని ఆ పార్టీ ఎన్నికల మేనిఫెస్టోలో హామీ ఇచ్చిన సంగతి తెలిసిందే. టీఆర్‌ఎస్‌ అధికారంలోకి రావడంతో ఈ ఏడాది డిసెంబర్, మరుసటి ఏడాది పదవీ విరమణ చెందే ఉద్యోగులు తమ సర్వీసు పెరుగుతుందని సంబరపడ్డారు. మరో రెండు లేదా మూడేళ్లు ఉద్యోగంలో కొనసాగవచ్చని ఆశలు పెట్టుకున్నారు. అయితే, ముఖ్యమంత్రి ఈ అంశంపై దృష్టి సారించి ఈ నెల నుంచే అమలు చేయాలని వారంతా విజ్ఞప్తి చేస్తున్నారు. లేదంటే తాము నష్టపోవాల్సి వస్తుందని ఆవేదన చెందుతున్నారు. తమకు ఎదురయ్యే ప్రతి టీఆర్‌ఎస్‌ ఎమ్మెల్యేకు వారు తమ గోడు వెళ్లబోసుకుంటున్నారు. పదవీ విరమణ వయసు పెంపు త్వరగా అమలు చేసేలా చర్యలు చేపట్టాలని కోరుతున్నారు.

గతంలో అనేకసార్లు చర్చ...
ఉద్యోగుల పదవీ విరమణ వయస్సు పెంపుపై గతంలో అనేకసార్లు ఉద్యోగుల్లో చర్చ జరిగింది. పదవీ విరమణ వయస్సును 58 ఏళ్ల నుంచి 60 ఏళ్లకు పెంచాలని ప్రభుత్వానికి విజ్ఞప్తులు చేశారు. ప్రభుత్వ శాఖలతోపాటు యూనివర్సిటీల్లోనూ అధ్యాపకుల పదవీ విరమణ వయస్సును పెంచాలని కోరారు. ప్రభుత్వం కూడా ఈ పెంపుపై పలు ఆలోచనలు చేసినా వివిధ కారణాలతో అది అమలు కాలేదు. బంగారు తెలంగాణ సాధనకు అనుభవం కలిగిన ఉద్యోగుల సేవలు అవసరమని భావించిన ముఖ్యమంత్రి చంద్రశేఖర్‌రావు పదవీ విరమణ వయస్సును 58 ఏళ్ల నుంచి 61 ఏళ్లకు పెంచుతామని ఎన్నికల సమయంలో హామీ ఇచ్చారు. అంతేకాదు ఇదే విషయాన్ని మేనిఫెస్టోలోనూ చేర్చారు.

కీలక అధికారులే ఎక్కువ...
వివిధ శాఖల్లో పని చేస్తున్న అధికారులు, ఉద్యోగుల్లో దాదాపు వెయ్యి మంది డిసెంబర్‌ 31వ తేదీన పదవీ విరమణ చేయనున్నారు. జాయింట్‌ డైరెక్టర్, డిప్యూటీ డైరెక్టర్‌ వంటి ఉన్నత స్థాయి కేడర్‌ అధికారులే వీరిలో ఎక్కువ మంది ఉన్నట్లు ఆర్థిక శాఖ అధికారులు లెక్కలు వేశారు. ఈ నేపథ్యంలో సీఎం కేసీఆర్‌ ఈ అంశంపై దృష్టి సారించి త్వరగా నిర్ణయం తీసుకోవాలని కోరుతున్నారు. డిసెంబర్‌ 31వ తేదీన రిటైర్‌ అయ్యే ఉద్యోగులకు సైతం 61 ఏళ్ల నిబంధన వర్తించాలంటే రాష్ట్ర ప్రభుత్వం వెంటనే చర్యలు మొదలుపెట్టాల్సి ఉంటుంది. ప్రభుత్వం వెంటనే నిర్ణయం తీసుకుని ఉత్తర్వులు జారీ చేస్తే దాన్ని అమలు చేయాలంటే కనీసం వారం రోజులు అవసరమవుతుంది. ఈలోపు ప్రభుత్వం దీనిపై నిర్ణయం తీసుకోకుంటే ఈ నెలలో రిటైర్‌ అయ్యే ఉద్యోగులు నష్టపోవాల్సిన పరిస్థితి ఉంటుంది. ప్రభుత్వ ఉద్యోగి ఒకసారి రిటైర్‌ అయితే మళ్లీ రెగ్యులర్‌ సర్వీసులోకి రావడం అసాధ్యం. 

Advertisement

తప్పక చదవండి

Advertisement